Tuesday, July 9, 2013

గంగ గరుడాలెత్తుకెళ్ళేరా..ఇంక ఆంబోతులాట సాగేరా

అద్భుతమైన ఒక పాట.ఈ పాట ప్రముఖ వ్యాఖ్యాత, నటి ఉదయభాను వ్రాశి పాడారు. ఇక్కడ చూడండి:

గంగ గరుడాలెత్తుకెళ్ళేరా..ఇంక ఆంబోతులాట సాగేరా..

ఎండినా దుక్కుల్ల సూడు, ఎన్నడెండని కండ్లు సూడు

భూమి బుగ్గై పోయె.. సూడు బొంద గడ్డల జోరు సూడు..


ఎవ్వారొ...

ఎవ్వారొ ముద్దు బిడ్డలు రా... ఎందుకనొ పరుగెట్టినారు రా..

ఎవ్వారొ ముద్దు బిడ్డాలెందుకనొ పరుగెట్టినారురా..


ఎవ్వారొ ముద్దు బిడ్డలెందుకనొ పరుగెట్టినారు
ఎర్రనీ మడుగుల్ల మునిగి ముద్దలాయె ముద్దు బిడ్డల్

బోరు బోరుగ గండమోర్లు పెట్టి గుండె పగిలే తల్లులు

ఈ కడుపుకోతలు నార్పెదెవ్వరు రా
ఆ కలుపు మొక్కల కాల్చెదెవ్వడు రా

రాకాసి బల్లులంతా రాజ్యమేలే రాజులంటా -2
రావణాసురులంత జేరి రోజు కొక్కా రచ్చ పెడితే..

పంట చీడను మట్టు పెట్టే పురుగు మందుల విందులాయె--2

ఎంత నెత్తురు ఏరులైన వ్వాని దూప తీరదాయే

జాలి జూపర జంగమయ్యా జాగిలాలా జాతరాపర.. -2
కొండ దిగిరా కొమూరన్నా కొండ ముచ్చుల కోర్కె దీర్పర..

రెండు పూటల్ పస్తులుండీ నిండు ప్రాణాలెన్నొ మింగె -2
గోండ్రు కప్పలు గుంట నక్కలు కాకి కూత కోడెనాగులు ..

గద్దె కొరకే గాడ్దికొడుకుల్ గత్తారాలేపేరురా
ఇది మారీచులాటరా నువ్ మర్మమెరుగర పామర
--2
ఆడు తెస్తడొ, ఈడు తెస్తడు
అవ్వ ఇస్తదొ అయ్య తెస్తడొ
-2
ఎవ్వడిచ్చెదేంది రా ఇది ఎవ్వనీ జాగీరురా.. -2

నీకు నువ్వే రాజురా నిన్నేలెటోడింకెవడురా-2

గంగ గరుడాలెత్తుకెళ్ళేరా ..ఇంక ఆంబోతులాట సాగేరా
ఎండినా దుక్కుల్ల సూడు, ఎన్నడెండని కన్ను సూడు

భూమి బుగ్గై పోయె సూడు బొంద గడ్డల జోరు సూడు..
గంగ గరుడా... గంగ గరుడాలెత్తుకెళ్ళేరా

Friday, June 29, 2012

కొంతకాలం నల్ల ధనం మరిచి పోదాం. ప్రణబ్ ను రాష్ట్రపతిని చేద్దాం.


నల్లధనం దాచుకున్న దొంగల పేర్లు బయట పెట్టే దమ్ము లేని వాడు రాష్ట్రపతి పదవికి అర్హుడా ?

పడిపోతున్న రూపాయిని వదిలి పెట్టి స్వార్థం చూసుకునే వాడు కనపడటం లేదా?

కనీసం ఆదాయపు పన్ను విధించినా వేల కోట్లలో ఆదాయం వచ్చే అవినీతి పరుల పై పన్ను ఏది ?

హసన్ అలీ అనే వాడి పేరు మారుమోగి ...మోగీ .. కనపడకుండా పోయిందేం ?

పదవులకోసం సర్దుకు పోయే చిల్లర మనుషులు రాష్ట్రపతులు అయితే వచ్చేదేముంటది ?

క్రిమినల్ లను కాపాడే వాడు క్రిమినల్ అయితే, ప్రణబ్  ?

Friday, June 22, 2012

ప్రణబ్ ముఖర్జీ వెనుకంజ...





పీ ఏ సంగ్మా తనతో దేశ ప్రస్తుత పరిస్థితుల పై ముఖాముఖి చర్చ కి రావాలని కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని సవాల్ చేస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం రాష్ట్రపతికి అటువంటి బాధ్యతలు లేవని తప్పుకోవాలని చూస్తోంది.

ఇప్పుడు వదిలేస్తే వీళ్ళకి కావల్సిన వ్యక్తులు అందలం ఎక్కాక చెట్టెక్కుతారు .. అవకాశాలు ఎలా ఉన్నా పోరాడుదాం.. ప్రణబ్ ముఖర్జీ తన డైరీ స్వయం గా ముఖాముఖి చర్చలో బయటపెట్టాలి. ఓటుకి నోటు, 2జీ ఇంకా అనేక రకాల కుంభ కోణాలకి , లావాదేవీలకీ సంబంధించిన ఏమైనా విషయాలు బయటపడొచ్చు..

ముఖాముఖి చర్చలో సత్తా కూడా తెలిసి పోతుంది.. ప్రశ్నిస్తే ఆగ్రహం వ్యక్తం చేసే వృద్ధ జంబూకాలు మనకొద్దు... నిక్కచ్చిగా పనిచేసే క్రమశిక్షణ గలవారు కావాలి..

మీ అభిప్రాయాలను టపాలుగా ప్రచారం చేయండి.. ఈ ఎన్నిక భయం కలిగించాలి మాయలు చేసే నాయకుల్లో..

Tuesday, June 5, 2012

పిల్ల అవినీతికి చెల్లు.. బడా చోరులకు జైలు..

ఇంతకాలం ఏముంది లే అని అంతా వదిలేస్తూ వచ్చిన ఐదూ, పది అవినీతి, ఇంతింతై పెద్దగద్దల రూపంలో వందల కోట్లకు పడగలెత్తింది. సామాన్యుల స్వాతంత్ర్యం మళ్ళీ బందీ ఐంది.

ఈ పాపం ఎవరిది ?.. చిన్న మొత్తాల్లో అవినీతి పరులైన ప్రజలందరిది. అవకాశం ఉన్నా, ఓటు రూపంలో బలహీనతలకు ఓటు వేశారు. కొరడా దెబ్బలు పడాల్సిందే, తినాల్సిందే.
ఇప్పుడు ఖరారు అయ్యే శిక్షల వల్ల సమాజ స్పృహ ఉన్న ప్రతి మనిషీ పైసా అవినీతికి కూడా జంకే స్థితి తప్పనివ్వకూడదు.. ఈ జంకు జైలు భయం కాదు, ఇక్కడ మొదలైతే ఎంత దూరం పోతుందో, చేజేతులా నాశనం చేసుకోలేక.

ఒకనాటి చిన్న అలసత్వం ఇప్పుడు మహా వృక్షాలై నిల్చున్నాయ్. వేళ్ళతో సహా ఈ దుష్ట సామ్రాజ్యాన్ని కూల్చాలంటే ఒక్కొక్కరూ భగత్ సింగ్ లై నడవండి. చలి చీమల చేత జిక్కి చావదె సుమతీ అన్నట్ట్లు, ఈ స్వార్థపు నాయకత్వాలను చీల్చే శూలాలై సాగండి.

ఒక మనిషి ఆహుతి అయితే, ఒక ఊరు మునిగిపోతే, ఒక జిల్లా ఎండి పోతే నాదేం పోయింది అంటూ వస్తున్న నరం లేని సంకెలలు తెంచుకొని నడుద్దాం. ఇప్పుడు కాక పోతే ఇంకెప్పుడూ కాదు. లేచి కర్తవ్యంతో నడుద్దాం. ఇప్పుడు జరగబోయే ఒక్కొక్కరి పోరాటం నిద్ర లేస్తున్న సమాజానికి వెయ్యి ఏనుగుల శక్తి ఇస్తుంది. ఇక ఆగేది లేదు స్వాతంత్ర్యం వచ్చే వరకు,  ఆగేది లేదు అవినీతి చచ్చే వరకు..